నా ప్రయాణం
నాలో కవి కవితాన్వేషణ
నా ప్రయాణాన్ని అన్వేషించడానికి స్క్రోల్ చేయండి
బహుమతి వేసిన బాట
2003 బడిలో వ్యాసరచన పోటీలకు చదువుతున్నప్పుడు నాన్న చెప్పిన పద్యమొక్కటి వ్రాస్తే మొదటి బహుమతి వచ్చింది మూడు పేజీలు వ్రాసిన ఆకట్టుకోలేని వ్యాసం ఒక్క పద్యంతో ఆకట్టుకుందని అనిపించి, వ్రాయటం మొదలు పెట్టాను.
"చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ!"
(వ్యాసాన్ని గెలిపించిన పద్యం)
ఉద్యమస్ఫూర్తి
2009 కాస్త ప్రపంచం పరిచయమయ్యాక కవితలని, పాటలని వ్రాస్తే భలే ఉన్నాయే అన్న ప్రశంసలు నన్ను మరింత ప్రోత్సహించాయి. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉదృతంగా జరుగుతున్న రోజులు నేను వ్రాసిన ఒక కవిత ధూం ధాం సభను చేరింది .
"పల్లె ప్రజల మనో వీణ
విద్యార్ధుల ఉద్యామాన
మేధావుల మనోగతాన
రేపోస్తది నా తెలంగాణ"
తపనాన్వేషణ
2014 నుంచి ఎక్కువగా కవితలు వ్రాసాననే చెప్పుకోవాలి, అప్పటిదాకా ఏవో మనసుకు తోచిన నానీలు వ్రాసిన ఆ సంవత్సరం నుండి కాస్త సామాజిక ఆధ్యాత్మిక అంశాలమీద ఆసక్తి పెరిగింది, వాటి పై వ్రాయటం మొదలు పెట్టాను. విదేశంలో ఉద్యోగం మరింత కొత్త సందర్భాలని, మనుషులని పరిచయంచేసింది.
"జారిపడినవని జాలి పడనీ ఈ లోకన్ని
లేచినిలబడి ఏలు నీ కాలాన్ని
నిరాశ నిట్టూర్పులు నీడ నిలిచె సైంధవులు
నీ ఆశ,విశ్వసాలు నీ అండ ఉండె సైనికులు
కష్టమనే కాలరాత్రి కబళించుకు పొతుంటే
విజయపు వెలుగు రేఖను కాంక్షిస్తు,శ్రమ చేస్తు నిలబడు
నీ కన్నీటితొ కలబడు"
పద్యంతో పరిచయం
2019 నా జీవితాన్ని మలుపు తిప్పిన సంవత్సరం, కోలుకోలేని దెబ్బ జీవితంలో కానీ పద్య కవిత్వానికి నన్ను దెగ్గర చేసింది కూడా. ప్రాణమైన అమ్మని కోల్పోయిన మా నాన్న నా కవితలు కొన్ని విని సులక్షణ సారము అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఈ కవితలు బానే ఉన్నాయి గాని పద్యం వ్రాయటం నేర్చుకో అన్నట్టుగా అనిపించింది. ఇప్పటికీ గుర్తు మొదటి పద్యం విమాన ప్రయాణంలో నిద్ర రాక ఆ పుస్తకం తీసి ప్రయత్నించిన, 8 గంటల ప్రయాణంలో నేను వ్రాసింది 2 పాదాలు, సీసపద్యం. తరువాత పెద్దలనడుగగా ఆటవెలది తో మొదలుపెట్టు కాస్త తేలిక అన్నారు, అప్పుడు వ్రాసిన మొదటి పద్యం రామానుజాచార్యుల మీద
"ఆ.వె||
విష్ణు చేరు త్రోవ విశిదముగాజూపి
అంటరానితనము నాపినావు
మాయ వాదములను మహిలోన ద్రుంచిన
గురువు నీవె మాకు మరువ లేము "
పూర్వీకులానుగ్రహం
2021 నాటికి అనేక కవి సమ్మేళనాలు,సాహిత్య పోటీలు గెలుచుకున్నాను. శతక వాఙ్మయం, కావ్యాలు చదవటం మొదలైంది. పద్యం నాలో ఉన్న కవిని ప్రపంచానికి పరిచయం చేసింది. వివిధ తెలుగు సంఘాలకి news letters వ్రాసే సాయం చేసాను. ఆధ్యాత్మిక సభలను నిర్వహించటంలో సాయపడ్డాను, అవధానాలలో పృచ్ఛకుని స్థాయి దాకా ఎదిగాను.
"పద్యం నా నేస్తం స్వర
వాద్యం గణములనుదీర్ణ వాణీ పాద్యం
యాద్యం భావరసాధిక
మద్యం సుకృతజనగహరమతికే సాధ్యం!"
కవితాలాపం
2025 నాటికి వివిధ పద్య ఖండికలు, కథలు, అప్పుడప్పుడు నాటి కళాశాల వయస్సును గుర్తుచేసే కవితలు వ్రాసి సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా పంచుకోటం మొదలుపెట్టాను. అందరూ నీ పద్యాలని అచ్చు వేయవచ్చు కదా అని అడిగారు, కానీ తెలుగులో ఎవరూ చదవకుండా అటకెక్కటానికి ఇంకో పుస్తకం అవసరం లేదు అనిపించింది. సాంకేతిక సాహిత్యం వ్రాసి దాన్ని అచ్చువేస్తే నేటి యువతరానికి మేలు చేసేది అవుతుంది అనిపించింది. దాని మీద కృషి సాగుతూ ఉండగా, ఈలోగా నా సాహిత్యాన్ని తెలుగు ప్రపంచంతో ఎందుకు పంచుకోకూడదు అని ఈ website మొదలు పెట్టాను. కాళీ సమయంలో చిన్నగా మొదలై నేడు ఇలా పూర్ణరూపం దాల్చింది. దీనిలో నేను వ్రాసిన సాహిత్యం అంతా అంశాల వారిగా పంచుకుంటాను. ఇది నాలో కవిగా మాట్లాడే వాడిని పరిచయం చేసే వేదిక, ఇది కొత్త అవకాశాలని ఇప్పించినా, యువతకి ఆసక్తి కలిగించినా ఈ ప్రయత్నం సఫలీకృతం అయినట్టే. అందుకే నా పద్యాలన్నిటికీ ఆంగ్ల హిందీ అనువాదం జతచేసాను. రండి కలిసి తెలుగులో మాట్లాడుకుందాం!
"తేనె పలుకులని జగతి పొగిడిన పద్యమెరిగిన భాష నాది
ఆది దేవునికి జోల పాడిన అన్నమయ్యా పాట నాది
కనక రాశిని చౌకగమ్మిన రాచరికపు చరిత నాది
వీరవనితల ఓర్పు మనది,అమరజీవుల ఆశ మనది
తలకట్టు దిద్దిన రాత నాది , తలయెత్తి తిరిగే ఖ్యాతి నాది
భారతమాత మకుట మణిగా వెలుగుతున్న తెలుగు జాతినాది "
సీ||
భావించు మదిలోన భాసిల్లు పద్యంబు
పలికించు జ్వాల నా తెలుగు భాష
లోకాలనేలేటి శ్రీకాంతు నిదురించు
దేవ జోలాలి నా తెలుగు భాష
నైజాము వణకంగ నాగళ్ళు పాడిన
యిల జానపదము నా తెలుగు భాష
త్యాగయ్య కీర్తించు రాగాల రామయ్య
తీపి స్వరములు నా తెలుగు భాష
ఆ.వె||
ఆత్మ గౌరవముతొ అద్దినేర్పిన భాష
దేశ భాషలందు తీపి భాష
కాలుదువ్విన తలకట్టు నాభాష
వెలుగు వేల యేండ్లు తెలుగు భాష
- తెలుగు భాష మహిమ
"A thoughtful heart can radiate verse divine,
And the flame that fuels this light — is my Telugu language.
The lullaby that lulls the Lord of all worlds to sleep,
Is none other than my Telugu language.
When ploughs sang songs of revolution in fields of fire,
Even the mighty Nizam trembled — such is my Telugu language.
The great Tyagaraja sang hymns to Lord Rama,
Their sweetness — the nectar of my Telugu language.
The tongue that taught us dignity and pride,
The sweetest of all in the languages of this land.
Even when tested, it rises above,
For its very letters wear crowns on their heads.
May this language — Telugu — shine for eternity."